Saturday 26 July 2014

గోమాత ఎలా ఉద్భవించినది?

 ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణ గ్రంథములో ఈ విధముగా ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణిసృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వార సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వార జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి ‘సురభి’ అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననీగా పరిగణిస్తారు.


సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోకులమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే !